kidnapped child । కిడ్నాపర్‌ను వదిలిరానన్న చిన్నారి.. చివరిలో కిడ్నాపర్‌ ఇచ్చిన ట్విస్టుతో పోలీసులకు దిమ్మతిరిగిందిగా!

Written by admin

Published on:

సాధారణంగా పిల్లలను కిడ్నాప్‌ చేసే ముఠాలు లేదా వ్యక్తులు.. వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తుంటారు. కొందరు వ్యక్తులు పిల్లలను అవయవాల ముఠాలకు అమ్మేస్తుంటారు.

కానీ.. ఈ కిడ్నాప్‌ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తాను కిడ్నాప్‌ చేసిన చిన్నారిని ఒక వ్యక్తి భద్రంగా పెంచుకున్నాడు. కిడ్నాప్‌కు గురైన పిల్లలు తమ తల్లిదండ్రులు కనిపిస్తే వారి వద్దకు పరిగెత్తుకుంటూ పోతారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం మాత్రం దానికి రివర్స్‌లో ఉన్నది. కిడ్నాపర్‌ నుంచి ఒక చిన్నారిని రక్షించిన పోలీసులు.. ఆ చిన్నారి ఆ కిడ్నాపర్‌ను వదిలిరానంటూ ఏడవటం చూసేవారిని ఆశ్చర్యచకితులను చేసింది.

ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. తనుజ్‌ చహర్‌ అనే వ్యక్తి గతంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి సస్పెండ్‌ అయ్యాడు. అతడు 14 నెలల క్రితం ఒక పృథ్వి అలియాస్‌ కుక్కు అనే చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. గత ఏడాది జూన్‌ 14న జరిగిన కిడ్నాప్‌లో ఆయనకు నలుగురు వ్యక్తులు సహకరించారు. ఆ సమయానికి చిన్నారి వయసు కేవలం 11 నెలలు. అప్పటి నుంచి ఆ చిన్నారిని చహర్‌ పెంచుకుంటూ ఆలన పాలన చూశాడు. అయితే.. కిడ్నాప్‌ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ చిన్నారి చహర్‌ వద్ద ఉన్నట్టు గుర్తించారు. చహర్‌ తన ఆనవాళ్లు తెలియకుండా గడ్డం, జట్టు పెంచుకుని ఒక సాధువు అవతారం ఎత్తాడు. కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. అయితే.. కిడ్నాపర్‌ నుంచి రక్షించే సమయంలో అతడిని వదిలి రావడానికి బాలుడుఇష్టపడలేదు. పైగా ఏడవడం మొదలు పెట్టాడు. దాంతో కిడ్నాపర్‌ కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో ఆ బాలుడు కూడా కిడ్నాపర్‌ను గట్టిగా హత్తుకుని మరింత బిగ్గరగా ఏడ్వ సాగాడు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని బుడతడు.. తనను కిడ్నాప్‌ చేసిన వ్యక్తితో పెంచుకున్న అనుబంధంతో అతడిని వదిలివచ్చేందుకు నిరాకరించాడు. దీంతో బలవంతంగా అతడిని నుంచి బాలుడిని వేరు చేసి, తల్లికి అప్పగించారు పోలీసులు. అయినా బాలుడు ఏడుపు ఆపలేదు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది. తనుజ్‌ చహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

కిడ్నాప్‌ చేసిన తర్వాత ఆ బాలుడిని చహర్‌ కంటికి రెప్పలా కాపాడుకున్నాడని తెలుస్తున్నది. బొమ్మలు, కొత్త డ్రస్సులు కొనిపెట్టాడు. ఎవరన్నా అడిగితే తన కొడుకేనని చెప్పేవాడని స్థానికులు తెలిపారు. ఇక్కడ ఒక ట్విస్టు కూడా ఉన్నది. తన వద్దే ఉండిపోవాలని చిన్నారి తల్లిని కిడ్నాపర్‌ కోరడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసులో లవ్‌ యాంగిల్‌ ఏమన్నా ఉందా? అనే అంశంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Comment