వన్డేలకూ వీడ్కోలు టీ20లకే పరిమితం

Written by hari

Published on:

ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నూతన సంవత్సరం తొలి రోజున మరో సంచలన నిర్ణయం ప్రకటించాడు. టెస్టుల మాదిరే ఇక వన్డే ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు చెబుతున్నట్టు 37 ఏళ్ల ఈ స్టార్‌ బ్యాటర్‌…

సిడ్నీ: ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నూతన సంవత్సరం తొలి రోజున మరో సంచలన నిర్ణయం ప్రకటించాడు. టెస్టుల మాదిరే ఇక వన్డే ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు చెబుతున్నట్టు 37 ఏళ్ల ఈ స్టార్‌ బ్యాటర్‌ సోమవారం వెల్లడించాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. గతేడాది వన్డే వరల్డ్‌క్‌పలో అద్భుతంగా రాణించిన వార్నర్‌.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో రెండు శతకాలు, రెండు హాఫ్‌ సెంచరీలతో 528 పరుగులు సాధించాడు. కొత్తవారికి అవకాశమిచ్చేలా ఈ ఫార్మాట్‌కు ముగింపు పలికేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. అలాగే ఈ రిటైర్మెంట్‌తో ఫ్రాంచైజీ లీగ్‌ క్రికెట్‌లో పాల్గొనేందుకు తగిన సమయం కూడా లభిస్తుందని భావిస్తున్నాడు. పాక్‌తో బుధవారం నుంచి జరిగే మూడో టెస్టు అనంతరం వార్నర్‌ సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్న విషయం తెలిసిందే. 2009లో వన్డేల్లో అరంగేట్రం చేసిన డేవిడ్‌ 161 మ్యాచ్‌ల్లో 45.30 సగటుతో 6,932 రన్స్‌ సాధించగా, ఇందులో 22 శతకాలున్నాయి. వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన పాంటింగ్‌ (29) తర్వాత వార్నర్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ 2025లో జరిగే వన్డే చాంపియన్స్‌ ట్రోఫీలో జట్టుకు అవసరమైతే రీఎంట్రీ ఇస్తానని వార్నర్‌ చెప్పడం గమనార్హం. కానీ ఇందుకు ఫిట్‌నెస్‌ కూడా సహకరించాల్సి ఉంటుందని తేల్చాడు.

Leave a Comment